Cinetollywood

కొండపొలం

నటులు:వైష్ణవ్ తేజ్,రకుల్ ప్రీత్ సింగ్,సాయిచంద్,కోట శ్రీనివాసరావు,హేమ,అంటోని,రవిప్రకాశ్‌దర్శకుడు: క్రిష్సినిమా శైలి:Adventure, Thriller

లక్ష్యం కోసం ప్రయాణం చేసే ఓ గొర్రెల కాపరి కొడుకు కథే ‘కొండపొలం’. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను క్రిష్ జాగర్లమూడి అదే పేరుతో వెండిపై ఆవిష్కరించారు. వ్యక్తిత్వ వికాసం దొరికేది పుస్తకాలు.. పేపర్లలోనూ కాదు.. మన చుట్టూ ఉన్నవాళ్లని స్పష్టంగా గమనిస్తే చాలు.. అంతకు మించిన జీవిత పాఠాలు ఎక్కడా దొరకవు అనే పాయింట్‌ని సందేశాత్మకంగా చూపించారు. అటవీ నేపథ్యంలో సాగిన అడ్వెంచరస్‌ డ్రామాగా సాగిన ‘కొండపొలం’ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

పుస్తకం, సినిమా రెండు భిన్నమైన మాధ్యమాలు.. ‘కొండపొలం’ నవల ఎన్నో అవార్డులు, రివార్డుల్ని పొందిన నవల. అలాంటి పాపులర్ నవలను సినిమాగా చిత్రీకరించడం కత్తిమీద సామే. అందులోని అటవీ నేపథ్యం ఉన్న అడ్వెంచరస్‌ కథకి కమర్షియల్ హంగులు జోడించడం అంటే కష్టమైన పనే.
దర్శకుడు క్రిష్‌ సినిమాలు చాలా ఉన్నతంగా.. విలువలతో కూడి ఉంటాయి. కొన్ని సినిమాల విషయంలో ‘కంచె’ దాటినా.. గమ్యంలో గాలి శీను.. వేదంలో కేబుల్ రాజు.. పాత్రలు క్రిష్ క్యారెక్టర్ పర్ఫెక్షన్‌కి తార్కాణాలు. మానవసంబంధాలు, వాస్తవజీవితంలో కనిపించే మనషుల కథలనే తెరపై ఆవిష్కరిస్తూ భావోద్వేగాలను పండించడంలో ఆయన దిట్ట. ‘గమ్యం’ రోడ్‌ జర్నీ మూవీ అయితే.. ‘వేదం’ అంథాలజీ.. ‘కంచె’ ప్రపంచయుద్ధం ఇలా తీసినవన్నీ విభిన్నమైన నేపథ్యాలతో తెరకెక్కినవే. ప్రతి సినిమా కొత్త అధ్యయనంలా తీయడమే క్రిష్ ప్రత్యేకత. గొర్రెల కాపరుల జీవన శైలి.. అడవి తల్లి నేర్పే పాఠాలను కళ్లకి కట్టిన దర్శకుడు ‘కొండపొలం’ నవలలో ఉన్న సోల్‌‌ని అందిపుచ్చుకోలేకపోయారు.

కడప జిల్లాకు చెందిన కటారు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. అతని తండ్రి గురప్ప (సాయి చంద్) గొర్రెల కాపరి. సగం గొర్రెలు కొడుకు చదువుకోసమే అమ్మేస్తాడు గురప్ప. చదువు పూర్తై నాలుగేళ్లైనా ఉద్యోగం రాకపోవడంతో ఇంటికి వెళ్తాడు రవీంద్ర. అదే సమయంలో గురప్ప గొర్రెల మందలు నీళ్లు లేక కరువుతో అల్లాడుతుంటాయి. దీంతో ఊరిలో కొంతమంది తమ గొర్రెల మందలను తీసుకుని ‘కొండపొలం’ మీదుగా నల్లమల అడవికి బయలుదేరతారు. ఈ సాహస ప్రయాణంలో తండ్రికి తోడుగా రవీంద్ర గొర్రెల్ని కాస్తూ నల్లమల అడవికి వెళ్తాడు. ఆ ప్రయాణంలో రవీంద్ర ఎదుర్కొన్న జీవిత పాఠాలు ఏంటి? వాటి ద్వారా గొర్రెల కాపరి కొడుకు ఐఎఫ్ఎస్ అధికారిగా ఎలా అయ్యాడు? ఓబులమ్మ (రకుల్) అతని జీవిత ప్రయాణంలో తోడుగా ఎలా నిలిచింది అన్నదే మిగిలిన కథ.

రాయల సీమ నేపథ్యంలో కథ అంటే ఎక్కువగా ఫ్యాక్షన్.. పగలు.. ప్రతికారాలనే చూపిస్తుంటారు. అయితే ఈ కథలో మూగజీవాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారిగా సీమ వాసుల్ని చూపించారు. వారి యాస, భాష కొత్తగా అనిపిస్తుంది. సోల్ ఉన్న కథకి కమర్షియల్ హంగులు జోడించే ప్రయత్నంలో భాగంగా ‘కొండపొలం’ నవలలో లేని ఓబులమ్మ (రకుల్) పాత్రను కొత్తగా సృష్టించారు. హీరోతో లవ్ ట్రాక్‌కి అన్నట్టుగానే కాకుండా.. పిరికివాడైన రవీంద్రలో పట్టుదలను నింపే గడుసరి పిల్లగా ఓబులమ్మ చూపించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే తెరపై మనకు రకుల్ కనిపిస్తుంది తప్పితే.. గొర్రెలు కాచే ఓబులమ్మ అయితే కనిపించదు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయలేకపోయింది రకుల్. క్యాస్టూమ్స్ కూడా ఆమెకు అతికించినట్టుగా ఉన్నాయి. పైగా గొర్రెలు కాసే ఓబులమ్మ పాత్రని రకుల్‌తో చేయిస్తున్నప్పుడు.. ఆమె వేళ్లకి ఉన్న వజ్రాల ఉంగరాలను కూడా తీయించలేకపోయాడు దర్శకుడు క్రిష్.

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.