Cinetollywood

సైరా మూవీ రివ్యూ

Sye raa narasimha reddy review

ఇంకా దేశభక్తి  ఈ సెల్ ఫోన్ రోజుల్లో సెల్లింగ్‌ పాయింటేనా…అంత బడ్జెట్ పెట్టి తీయటానికి…అదీ ఎవరికీ… అయితే వీటిల్లో ఏది జనాలను థియోటర్స్ ముందు నిలబెట్టి, టిక్కెట్ కొనిపించినా..గొప్పగా ఉంటేనే గ్రేట్ అంట…

కథ.. ఇప్పటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడకు పాలెగాడు గా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి దత్తపుత్రుడు. ఆ విషయం బ్రిటీష్ వాళ్లకు తెలుసు. వాళ్లు చేసే అకృత్యాలు నరసింహారెడ్డి కు తెలుసు. నరసింహారెడ్డి తనకు సాధ్యమైనంతలో వాటిపై పోరాడుతూండేవాడు. ఓ రెబల్ గా తోటి పాలెగాళ్లు సాయిం లేకపోయినా బ్రిటీష్ వాళ్లకు మొండిగా ఎదురెళ్లే వాడు. రైతులు తరపున పోరాడేవాడు. ముఖ్యంగా కరువు కాటకాలతో శిస్తు కట్టలేని రైతులను హింసిస్తున్న బ్రిటీష్ వాళ్లపై …నరసింహా రెడ్డి ఆవేదనతో తిరగబడటంతో ప్రత్యక్ష్య పోరు ప్రారంభమైంది. దానికి తోడు బ్రిటీష్ వారు ప్రతీ నెలా ఇచ్చే భరణం కోసం తన అనుచరుడు(బ్రహ్మాజి)ని పంపితే అతన్ని అవమానించి పంపించారు. ఓ ప్రక్క కరువు, మరోప్రక్క బ్రిటీష్ వాళ్ల అకృత్యాలు, పన్ను కట్టవద్దని పిలుపు ఇచ్చాడని నరసింహారెడ్డిపై కక్ష సాధింపు చర్యలు. వీటిన్నటితో విసిగిన నరసింహారెడ్డి మన దేశానికి స్వాతంత్ర్యం వస్తే గానీ ఈ సమస్యల నుంచి విముక్తి ఉండదని భావించి తిరుగుబాటు ప్రారంభించాడు. అయితే నరసింహారెడ్డికు మొదట్లో తోటి పాలెగాళ్లు ఎవరూ కలిసి రాలేదు. బ్రిటీష్ వాళ్ల నుంచి వచ్చే భరణంతో ఆనందంగా ఉండక ఈ తగువులు ఎందుకు అనేది వారి వాదన. అలాంటి వాళ్లకు నాయకుడు అవుకురెడ్డి (సుదీప్).

అయినా ఒంటిరిగానే పోరాటం ప్రారంభించి…బ్రిటీష్ వాళ్ల గుండెళ్ళో రైళ్లు పరుగెత్తించాడు. అక్కడ నుంచి ఏం జరిగింది. బ్రిటీష్ వాళ్లు ఊరుకున్నారా..వాళ్లు ఏం ఎత్తులు వేసారు.. నరసింహారెడ్డి వాళ్లకు బదులు ఎలా తీర్చాడు. సిద్దమ్మ(నయనతార)తో వివాహం ఎలా జరిగింది. లక్ష్మి (తమన్నా) పాత్ర ఏమిటి, అవుకురెడ్డి చివరకు ఏమయ్యాడు..వీరారెడ్డి(జగపతిబాబు)పాత్ర ఏమిటి,రాజ పాండి(విజయ్ సేతుపతి) సినిమాలో ఏం చేసాడు..గోసాయి వెంకన్న (అమితాబ్)పాత్ర సినిమాలో ప్రాధాన్యత ఏమిటి…మరీ ముఖ్యంగా అనుష్క ఈ సినిమాలో ఏ పాత్ర వేసింది, చివరగా నరసింహారెడ్డికు వెన్ను పోటు పొడిచింది ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉంది: సైరా సినిమా ఒక స్వాతంత్ర్య సమర యోధుడు వీరత్వానికి, పౌరషానికి , ఔన్నత్యానికి దివిటీ అవుతుందనుకుంటే… ‘ఇది చరిత్ర కాదు. కల్పనే’ అని ఖరాఖండిగా చెప్పిన సురేంద్రరెడ్డి…కొంచెం నిరుత్సాహం కలిగించాడు. అయితే బ్రిటీష్ వారితో చివరి వరకూ పోరాడి, ఓడి,గెలిచి,ఉప్పెనలాంటి ఓ పోరాటానికి స్పూర్తిని ఇచ్చిన నరసింహా రెడ్డి ని మన ముందు నిలిపాడనటంలో సందేహం లేదు ! సినిమా చూడ్డానికి బాగుంది. చరిత్ర అవుతేనేం, కల్పన అయితేనేం మనం నిమగ్నం అవడానికి స్ఫూర్తి పొందడానికి కీర్తించుకోడానికి కూడా ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది.

చరిత్ర కాకపోవచ్చేమో కాని చరిత్రలో నిలబడుతుంది. అయినా చిరంజీవి వయస్సు ఏమిటి…ధీరత్వంతో కూడిన ఆ ఫెరఫార్మెన్స్ ఏమిటి అని ఆశ్చర్యపోకుండా ఉండలేం. చాలా చోట్ల నరసింహారెడ్డి పాత్రతో మెగాస్టార్ పోటీ పడతాడు. తనను తాను సవాల్ చేసుకుంటాడు. అందుకే ఈ సినిమా మెగాస్టార్ నటనా బయోపిక్ అనాలి.
విజువల్స్ … సురేంద్రరెడ్డి గత సినిమాల్లాగే సాంకేతికంగా గ్రాండ్‌గా ఉంది. విజువల్లీ రిచ్‌ అనాల్సిందే. అలాగే ఇది బాగా తీయబడిన సినిమా..అదే సమయంలో బాగా రాయబడిన సినిమా కూడా. చివరి అరగంట సైరా..ని ఉరితేసే ఘట్టంలో మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటాయి.ఇప్పటికీ స్వాతంత్ర్యం రాకపోతే మనం వెళ్లి తెచ్చేద్దాం అనే ఊపు తెస్తుంది. ఆ ఎమోషన్స్ తోనే సినిమాకు తెర పడుతుంది.

కథనం.. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాయటం అంటే కత్తి మీద సామే. ఎందుకంటే వరస సంఘటనలు తప్పించి, చెప్పుకోవటానికి కథేమి ఉండదు. పోనీ ఆ సంఘటలు చూస్తే ఫలానా బ్రిటీష్ ఆఫసర్ ని చంపాడు…మరో బ్రిటీషన్ ని చంపాడు..బ్రిటీషర్స్ మనవాళ్లను చంపారు. మళ్ళీ బ్రిటీష్ వాడిని చంపాడు ఇలా సాగుతుంది. చివర్లో విజయం సాధించను లేదు. ఇలాంటి కథకు స్రీన్ ప్లేను బోర్ కొట్టకుండా రాయటంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే ఫస్టాఫ్ ని పూర్తిగా కథా సెటప్ కే వినియోగించటంతో చాలా స్లో గా సాగినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ దగ్గరకు వచ్చేసరికి పికప్ అవుతుంది. ఇంటర్వెల్ సీన్ సైతం మనకు ఛత్రపతి ఇంట్రవెల్ టైప్ లో డిజైన్ చేసి రాజమౌళిని గుర్తు చేస్తాడు దర్శకుడు. సెకండాఫ్ లో …ఇక పుంజుకుంది అనుకుంటే వరస ఒకే రకం ఎపిసోడ్స్ వచ్చాయి. అయినా చూస్తున్నంతసేపు ఆ విషయం గుర్తుకు రాదు. అలా చిరంజీవి,సురేంద్రరెడ్డి మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. క్లైమాక్స్ మాత్రం పూర్తిగా ఎమోషన్ పై ఆధారపడి చేసారు. అది ఎంతవరకూ క్లిక్ అవుతుందనేది చూడాలి.

ఎవరు …ఎలా అక్కడక్కడా చిరంజీవి గెటప్, డ్రస్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా, కొన్ని సీన్స్ లో వయస్సు కనిపించినా.. ఆయన అనుభవ నటన ముందు అవన్ని ఎగిరిపోయాయి. అలాగే విజయ్ సేతుపతి, సుదీప్, అమితాబ్, జగపతిబాబు, సాయిచంద్ ..ఇలా వీళ్లందరినీ చూస్తేనే తెరపై ఏదో మ్యాజిక్‌ జరుగుతుందనిపిస్తుంది. ఆ నమ్మకాన్ని చాలా వరకూ అందరూ నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా అవుకురాజుగా సుదీప్ కు మంచి క్యారక్టర్ దొరికింది. విజయ్ సేతుపతి వంటి నటుడు కు సరపడ పాత్ర అయితే కాదనిపించింది. నయనతార ని తమన్నా కనపడనీయకుండా చేసింది.

మిగతా విభాగాలు.. ఈ సినిమాకు మంచి బడ్జెట్ తో టాప్ టెక్నీషియన్స్ తీసుకువచ్చారు నిర్మాత చరణ్. వారి నుంచి బెస్ట్ అవుట్ పుట్ తీసుకున్నారు సురేంద్రరెడ్డి. అయితే దేశభక్తి సినిమాకు కమర్షియల్ టచ్ మరీ ఎక్కువైందేమో అని కొన్నిసీన్స్ లో అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సీన్స్ లో నరసింహారెడ్డి పాత్ర ఓ రాజు యుద్దానికి వెళ్లినట్లుగా ఉంటుంది.. ఆ గ్రాండియర్ ..ఆ లుక్ . అంతే కానీ పాలెగాడు పదవి కూడా లేని ఓ ఉద్యమకారుడు నడిపించినట్లు అనిపించదు. ముఖ్యంగా పదివేల మంది బ్రిటీష్ వాళ్లని నరసింహారెడ్డి తన వాళ్లతో కలిసి చంపినట్లు చూపించారు. అసలు కర్నూలు లో అంత పెద్ద యుద్దం జరిగిందా ..అదెలా చరిత్ర మర్చిపోయింది అనే సందేహం వస్తుంది.

చరిత్ర చెప్పకు..చెప్పింది విను ‘‘ఈ చిత్రం కొంత ఫిక్షన్..కొంత విన్నది..తెలుసుకున్నది .’’ అని అర్దం వచ్చే వాక్యాలతో సినిమా ప్రారంభించారు . కాబట్టి కూల్ గా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, చరిత్రను తవ్వుకుని ప్రశ్నించుకోకుండా చేసేయటం బెస్ట్. ఎందుకంటే సినిమా రాకముందు మనలో చాలా మంది నరసింహా రెడ్డి ఎవరూ అని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ సినిమా తో కొంతైనా ఎవర్ నెస్ తెచ్చినందుకు ఈ సినిమా నిర్మాతకు,చిరంజీవి కు ధాంక్స్ చెప్పాలి.

ఫైనల్ థాట్: అప్పుడప్పుడూ ఇలాంటి సినిమాలు వస్తూంటే…మనం అనుభవిస్తూన్న స్వతంత్ర్యం ఎంత విలువైందో అర్దమవుతుంది.

రేటింగ్: 4/5

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.