Cinetollywood

బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన విలువల్ని కాపాడతాం – పవన్ కళ్యాణ్

Ambedkar's values are protected - Pawan Kalyan

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్న రాజ్యాంగ విలువల స్ఫూర్తిని కాపాడడానికే మేం జవాబుదారీతనం తో కూడిన రాజకీయాలు అనే వైపుగా వెళుతున్నామని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.

రాజకీయ నాయకుల్లో ఇవాళ అంబేద్కర్ మహాశయుడు అందించిన స్ఫూర్తి లోపించింది అన్నారు. బుధవారం ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. లక్నోలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు బస చేసిన హోటల్ కు పలువురు విద్యావేత్తలు వచ్చి కలిశారు. అనంతరం లక్నోలోని డా.భీంరావ్ అంబేద్కర్ సామాజిక్ పరివర్తన్ ప్రతీక్ స్థల్ (అంబేద్కర్ మెమోరియల్ పార్క్)ను సందర్శించారు. 107 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ లోని గ్యాలరీలు, మ్యూజియంలు తిలకించారు. సమానత్వం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాటలు వేసిన మహానీయుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఒకరోజు పర్యటనను బుధవారం సాయంత్రం ముగించుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి మరింత ఎక్కువ విషయాలు తెలుసుకోగలిగేలా ఇక్కడకు రావడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. కాన్షీరామ్, నారాయణ్ గురు, సాహు మహరాజ్, పూలే లాంటి సంస్కర్తలే రాజకీయాల్లోకి రావడానికి మాకు స్ఫూర్తిదాతలు. వీరి నిబద్ధత, చిత్తశుద్ధి, జాతి పట్ల అంకిత భావాలను మా తెలుగు రాష్ట్రాలకు కూడా తీసుకువెళ్తాను. వారి దృఢమైన చిత్తశుద్ధిని ఆర్తులకు, వెనుకబడిన వర్గాలకు అందేలా చూస్తాం. ఈ అంబేద్కర్ స్మారక పార్కును సందర్శించడం అనేది.. మమ్మల్ని కర్తవ్యోన్ముఖులుగా జాగృతపరిచే గొప్ప అనుభవంగా భావిస్తున్నాను. ఈ స్మారక పార్కును చాలా చక్కగా నిర్వహిస్తున్నారు.

ఒకసారి ప్రధాని పార్లమెంటులో ఒక మాట చెప్పిన తర్వాత అది శాసనంతో సమానం. దానిని అమలు చేసి తీరాల్సిందే. రాజ్యాంగ విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. రాజకీయ జవాబుదారీతనం లేకపోవడం వల్లే ఈ విధంగా జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని మేం బలంగా డిమాండ్ చేస్తున్నాం. బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నది మా లక్ష్యం. మా అజెండా. దానికి సంబంధించి.. వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అనుసరిస్తున్న పోకడల్ని కూడా పరిశీలిస్తున్నాం అన్నారు.

రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం

సువిశాలమైన అంబేద్కర్ మెమోరియల్ పార్క్ ను మొత్తం నడిచి సందర్శించడం కష్ట సాధ్యమే. ప్రముఖులు కారులో తిరిగి విగ్రహాలను తిలకిస్తారు. అయితే శ్రీ పవన్ కల్యాణ్ గారు పార్క్ లోని విగ్రహాలను, పలు గ్యాలరీలు, సందర్శన కేంద్రాలను కాలి నడకనే తిరిగారు. ఇలా పార్క్ ని కాలి నడకన తిరిగి సందర్శించిన రెండో ప్రముఖుడు శ్రీ పవన్ కల్యాణ్ గారేనని పార్క్ అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ ఇంతకు ముందు ఇదే విధంగా కాలి నడకన పార్క్ ను తిలకించారు.

శ్రీ పవన్  కళ్యాణ్ గారు మహనీయులు  బాబాసాహెబ్ అంబేద్కర్, డా.రాజేంద్ర ప్రసాద్, మాన్యవర్ శ్రీ కాన్షీరామ్, సంత్ నారాయణ గురు, మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, రాజశ్రీ ఛత్రపతి సాహూజీ మహారాజ్, గురు ఘాసీ దాస్, గౌతమ బుద్ధ, సంత్ రవిదాస్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. గ్యాలరీల్లో అంబేద్కర్ జీవిత ఘట్టాలు, రాజ్యాంగ రచన కాలం వివరాలను తెలిపే ప్రతిమలు ఉన్నాయి. వాటిని తిలకించిన శ్రీ పవన్ కళ్యాణ్  గారు  “రాజ్యాంగ విలువల్నీ, స్పూర్తినీ మనకు వారసత్వంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు, వాటి పరిరక్షణ కోసం పని చేయాల్సిన అవసరం అందరిపైనా ఉంద”ని తన వెంట ఉన్న నాయకులు, విద్యార్థులు, విద్యావేత్తలతో చెప్పారు. ఇంత మంచి విగ్రహాలను నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.