Cinetollywood

తిరుగులేని సేంద్రియ జామ

The undisputed organic jama

* జామ, మామిడి సాగు.. గొర్రెలు, కోళ్ల పెంపకం

* రంగారెడ్డి జిల్లా మహిళారైతు విజయం

సమగ్ర వ్యవసాయానికి చిరునామా ఆ మహిళా రైతు. సేంద్రియ పద్ధతుల్లో జామ, మామిడి సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన కొలన్‌ పుష్పలతారెడ్డి. సేద్యంతో పాటు, కోళ్లు, గొర్రెలను పెంచుతూ లాభాలు ఆర్జిస్తున్న ఆ మహిళారైతు ప్రస్థానం ఇది.

 
కొలన్‌ బుచ్చిరెడ్డి, పుష్పలతారెడ్డి దంపతులకు మొండిగౌరెల్లిలో 12 ఎకరాల మెట్ట భూమి వుంది. అందులో ఆరెకరాల భూమిలో జామతోటలు సాగు చేస్తున్నారు. మూడు ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. ఐదు బ్రాయిలర్‌ కోళ్ల షెడ్లు నిర్మించారు. ఒక్కో షెడ్డులో పది వేల కోళ్లు అంటే మొత్తం 50 వేల కోళ్లు పెంచుతున్నారు. నాలుగు ఆవులు, 30 గొర్రెలను పెంచుతున్నారు ఆ మహిళా రైతు. జామ, మామిడితో పాటు సేంద్రియ పద్ధతిలో వరి సాగు చే సి అధిక దిగుబడి సాధించారామె.

• లక్షా 30 వేల ఆదాయం

 

ఆరెకరాల జామ సాగు చేయాలని నిర్ణయించుకుని ముందుగా పొలాన్ని నాగలితో బాగా కలియదున్నించారు. ఆ తరువాత సాధారణ ట్రాక్టర్‌తో దున్నిన పొలాన్ని చదును చేయించారు. పొలం చదును చేసే ముందు పొలంలో ఉన్న గడ్డి, ఇతర వ్యర్థాలను బయట పడేయకుండా పొలంలోనే పాతారు. అలా చేయడం వల్ల ఆ వ్యర్థాలు వర్షం నీటికి నాని భూమి లోపల ఎరువుగా మారాయి. దున్నిన పొలంలో రెండు అడుగుల పొడవు, రెండడుగుల వెడల్పు, రెండు అడుగుల లోతులో గుంటలు తవ్వారు. గుంతల్లో వేపపిండి, గొర్ల ఎరువులు, పశువుల పేడ వేసి మట్టిలో బాగా కలిపారు. అనంతరం దాంట్లో నీరుపెట్టి నెల రోజులు మురుగపెట్టారు. ఇలా చేయడం వల్ల గుంతలో ఎరువులు మట్టిలో కలిసి పోయి నేల సారవంతం అయింది. ఆ తరువాత ఆ గుంతలో అలబాస ఫేదా, లక్నో 49 రకం జామ మొక్కలు నాటారు. ఒక్కో మొక్కకు ఎనిమిది అడుగుల దూరంలో జామ మొక్కలు నాటారు. మొక్క నాటిన తరువాత గుంత పైభాగంలో పశువుల ఎరువు మిశ్రమం వేసి నీరు పెట్టారు. మొక్కకు రెండున్నర గజాల దూరం వరకు కోపు గుంత తీసి పశువుల ఎరువు వేశారు. కోపు గుంత తీస్తే వర్షం కురిసినా వర్షం నీరు వృధాగా పోకుండా మొక్కకు అందుతుంది. అంతేగాక మొక్క వేరు లోతుగా వెళుతుంది. ఆ తరువాత మొక్కలకు డ్రిప్‌తో నీరందిస్తే త్వరితగతిన మొక్కకు నీరు చేరి బాగా పెరుగుతుందన్నారు ఆ మహిళా రైతు. మొక్క నాటిన ఏడాదిన్నర వరకు ఎలాంటి తెగులూ రాకుండా తరచూ వేపకషాయం, వేపనూనెలు వాడి చీడపీడలను నివారించారు. మొక్కలకు దగ్గరగా వేపపిండి వేశారు.

 

 

వేపపిండి నేలలో వేస్తే ఆ చేదుకు తోట వేర్లను పాడు చేసే పురుగులు చనిపోతాయి. వేపనూనె, వేపకషాయం పిచికారీ చేస్తే తోటను పాడు చేసే పురుగులు చనిపోతాయి. మొక్క నాటిన ఏడాదిన్నరకు మొక్క కాతపట్టింది. తోటలో మొలచిన గడ్డి ఇతర పిచ్చిమొక్కలను ట్రాక్టర్‌తో దున్నించి వాటిని నేలలోనే చాలా లోతుగా గోతిలో వేయించారు. దీంతో నేలసారం పెరగడంతో పాటు వర్షం కురిస్తే నీరంతా పొలంలోనే ఇంకేది. మిగిలిన వరదనీరు పొలం చుట్టూ ఉన్న గుంతల్లోనే ఇంకేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో బోరు బావిలో నీరు పుష్కలంగా వుంటున్నది. మొక్కలు నాటిన 18 నెలలకు మొక్క కాత పట్టింది. ఒక మొక్కకు 25 నుంచి 35 కాయలు పట్టాయి. సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్న ఈ జామకు మంచి ధర పలుకుతున్నది. కొందరు వ్యాపారులు నేరుగా తోటకు వచ్చి కిలో 30 నుంచి 40 వరకు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. వారు రానిపక్షంలో పుష్పలతారెడ్డి స్వయంగా మార్కెట్‌కు వెళ్లి పంటను విక్రయిస్తున్నారు. ఇలా ఎకరం జామ తోట నుంచి ఏటా 1.3 లక్షల ఆదాయం లభించినట్లు ఆమె వివరించారు.

• మామిడి నుంచి 4 లక్షల లాభం

ఇదే తరహాలో మూడెకరాల్లో బంగినపల్లి, మల్లిక రకం మామిడి నాటారు. వాటికి నిరంతరం డ్రిప్‌ ద్వారా నీరందిస్తూ సేంద్రియ పద్ధతుల్లో పెంచారు. ఎకరం మామిడి తోట నుంచి ఏటా 4 లక్షల లాభం పొందారు మహిళా రైతు పుష్పలతారెడ్డి. రెండెకరాల్లో శ్రీవరి సాగు చేశారామె. డ్రమ్‌సీడర్‌తో నాట్లు వేయించారు. చీడపీడలు రాకుండా సేంద్రియ ఎరువులు వాడారు. రెండు ఎకరాల పొలంలో 48 క్వింటాళ్ల బియ్యం పొందారామె. గతేడాది 60 గొర్రె పిల్లలు అమ్మి 80 వేల రూపాయలు సంపాదించారు. ప్రస్తుతం 20 గొర్రెలను పెంచుతున్నారు. వాటిని తన జామ, మామిడి తోటల్లోనే మేపుతున్నారు. వాటి వ్యర్ధాలను పంటలకు ఎరువుగా వాడుతున్నారు.

• సేంద్రియమే శరణ్యం

రసాయన ఎరువులు పంటలకు వాడితే పొలం పాడవుతుంది. వాతావరణం కలుషితం అవుతుంది. ఆహారపదార్థాలలో పోషక విలువలు తగ్గిపోతాయి. ఆవుపేడ, ఆవుమూత్రం, గొర్లమంద, వేపకషాయం, వేపనూనె, వేపపిండి సద్వినియోగం చేసుకుంటే ఎంతో నాణ్యమైన ఆహారపదార్థాలు పండించుకోవచ్చు. పుస్తకాల్లో చదివి సేంద్రియ సేద్యం నేర్చుకున్నాను. ఈ తరహా సేద్యం వల్ల మనం ఆరోగ్యంగా వుంటాం. నేల కూడా ఆరోగ్యంగా వుంటుంది.
– కొలన్‌ పుష్పలతారెడ్డి, మహిళా రైతు, మొండిగౌరెల్లి

Gallery

Latest Updates

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.