Cinetollywood

సినిమా రివ్యూ:మంచి రోజులు వ‌చ్చాయి

నటులు:సంతోశ్ శోభన్,మెహరీన్ కౌర్,అజయ్ ఘోష్,ప్రవీణ్,వెన్నెల కిషోర్దర్శకుడు: మారుతిసినిమా శైలి:Drama, Family, Comedy

మనిషిలో సంతోషం, దు:ఖం, కోపం త‌ర‌హాలో భ‌యం కూడా ఓ ఎమోష‌న్‌. మ‌నిషికి భ‌యం ఉండాలి. కానీ దానికి ఓ ప‌రిమితి ఉండాలి. ఎక్కువ భ‌య‌ప‌డినా ప్ర‌మాదమే. అనే పాయింట్‌ను చెప్ప‌డానికి డైరెక్ట‌ర్ మారుతి చేసిన ఓ ప్ర‌య‌త్న‌మే ‘మంచి రోజులు వచ్చాయి’. మన పక్కనే ఉంటూ మ‌న‌కు మంచి చేస్తున్న‌ట్లు న‌టిస్తూ చెప్పుడు మాట‌లు చెప్పే వ్య‌క్తులు మ‌న‌కు లేనిపోని భ‌యాల‌ను క‌లిగిస్తుంటారు. వాట‌న్నింటినీ దూరంగా ఉంచి సంతోషంగా జీవితంలో ముందుకెళ్లాల‌ని మారుతి చెబుతూ చేసిన మంచి రోజులు వ‌చ్చాయి సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంది? సంతోశ్ శోభ‌న్‌, మెహ‌రీన్‌ల‌కు స‌క్సెస్ వ‌చ్చిందా? మారుతి త‌న‌దైన ఎంట‌ర్‌టైన్మెంట్‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారా? లేదా? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:
క‌థ 2020 ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం అవుతుంది. హైద‌రాబాద్‌లోని భ‌వానీ న‌గ‌ర్‌లో ఉండే తిరుమ‌ల శెట్టి గోపాలం అలియాస్ గుండు గోపాలం(అజ‌య్ ఘోష్‌) భ‌యం ఎక్కువ‌. అత‌ని కూతురు ప‌ద్మ‌జ‌(మెహ‌రీన్‌) బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటుంది. అదే కంపెనీలో ప‌నిచేసే త‌న కొలీగ్ సంతోశ్‌( సంతోశ్ శోభ‌న్‌)ను ప్రేమిస్తుంది. ఇద్ద‌రూ మూడేళ్లుగా రిలేష‌న్‌లో ఉంటారు. క‌రోనా అప్ప‌టికి మ‌న దేశంలోకి వ‌చ్చి ఉండ‌దు. అమెరికాలో దాని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఇండియాలో క‌రోనా ప్ర‌భావం మొద‌లు కాక‌ముందే సాఫ్ట్‌వేర్ కంపెనీల‌న్నీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కు ప‌ర్మిష‌న్స్ ఇవ్వ‌డంతో సంతోశ్‌, ప‌ద్మ‌జ హైద‌రాబాద్ బ‌య‌లుదేరుతారు. అయితే ఈలోపు గోపాలం కాల‌నీలో ఉండే మూర్తి, కోటి ఇద్ద‌రు వ్య‌క్తులకు గోపాలం సంతోషంగా ఉండ‌టం న‌చ్చదు. దాంతో వాళ్లు గోపాలంలోని భ‌యం పుట్టించి త‌ను బాధ‌ప‌డుతుంటే చూడాల‌నుకుంటారు. దాంతో ప‌ద్మ‌జ ఎవ‌రితోనూ ప్రేమ‌లో ఉంద‌ని, లేచిపోతుందని, దాంతోకుటుంబం ప‌రువు పోతుంద‌ని, రోడ్డున ప‌డ‌తావ‌ని ఇలా గోపాలంలో లేనిపోని భ‌యాల‌ను రేపుతారు. దాంతో గోపాలం చిన్న చిన్న విష‌యాల‌ను పెద్ద‌దిగా ఆలోచిస్తూ భ‌య‌ప‌డుతుంటాడు. ఒకానొక సంద‌ర్భంలో మూర్తి, కోటి దెబ్బ‌కు గోపాలంకు గుండె నొప్పి కూడా వ‌స్తుంది. దానికి కార‌ణం సంతోశ్‌ను ప్రేమించ‌డ‌మేన‌ని మూర్తి, కోటి క‌లిసి ప‌ద్మ‌జ‌ను తిడ‌తారు. దాంతో ఆమె సంతోశ్‌ను క‌లిసి త‌న తండ్రికి ఏమైనా అయితే ముఖం కూడా చూడ‌న‌ని వార్నింగ్ ఇస్తుంది. త‌న ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికి అప్పుడు సంతోశ్ ఏం చేస్తాడు? చివ‌ర‌కు గోపాలంలో భ‌యాన్ని ఎలా పోతుంది? సంతోశ్‌, ప‌ద్మ‌జ ఒక్క‌ట‌య్యారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

స‌మీక్ష‌:

మ‌నిషిలో ఏదో ఒక లోపాన్ని పెట్టి దాని చుట్టూ ఓ క‌థ‌ను అల్లి దాన్ని చివ‌ర‌కు స‌ద‌రు వ్య‌క్తి ఎలా అధిగ‌మించాడ‌నే క‌థాంశంతో క‌థ‌ను తెర‌కెక్కించ‌డం మారుతికి కొత్తేం కాదు. గతంలో ఆయ‌న చేసిన ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు’ వంటి చిత్రాల‌ను అదే పంథాలో తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకున్నాడు. అదే స్టైల్లో ఈసారి మారుతి ఎంచుకున్న పాయింట్ మ‌నిషిలో ఉండే భ‌యం. అయితే సాధార‌ణంగా మారుతి త‌న క‌థ‌లోని హీరోకు ఇలాంటి లోపాన్ని పెట్టి తన‌ని సెంట‌ర్‌గా చేసుకుని క‌థ‌ను అల్లుకుంటాడు. కానీ ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమాలో లోపాన్ని హీరో సంతోశ్ శోభ‌న్‌కు కాకుండా హీరోయిన్ మెహ‌రీన్ తండ్రి పాత్ర‌లో న‌టించిన అజ‌య్ ఘోష్ పాత్ర‌కు ఆపాదించాడు. త‌న పాత్ర‌ను ప్ర‌ధానంగా చేసుకుని పాత్ర‌లు అల్లుకుంటూ వ‌చ్చాడు. అయితే ఆయ‌న ఇలాంటి కాన్సెప్ట్‌తో తెర‌కెక్కించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు చిత్రాల త‌ర‌హాలో ఈ సినిమాను అంత ఎంట‌ర్‌టైనింగ్‌గా గ్రిప్పింగ్‌గా రాసుకోలేదు. ఫ‌స్టాఫ్‌లో క‌థ‌ను అటు ఇటు తిప్పిన చోటే తిప్పిన‌ట్లు అనిపిస్తుంది. దీంతో బోరింగ్‌గా ఇదేంటి .. సినిమా అక్క‌డే ఉంద‌నే ఫీలింగ్ ప్రేక్ష‌కుడికి వ‌స్తుంది. అజ‌య్ ఘోష్ అనే పాత్ర‌లోని భ‌యాన్ని ఎక్కువ‌గా హైలైట్ చేస్తూ చూపించడంతోనే ప్ర‌థ‌మార్ధాన్ని ముగించారు ద‌ర్శ‌కుడు మారుతి.
ఇక సెండాఫ్ ఫ‌స్టాఫ్ మీద కాస్త బెట‌ర్‌. కూతురికి తండ్రిపై, తండ్రికి కూతురిపై ఉన్న ఎమోష‌న్‌ను చూపిస్తూనే త‌ల్లి కొడుకుల మ‌ధ్య అనుబంధాన్ని ఓ కోణంలో ఎలివేట్ చేసుకున్నాడు. అయితే ఈ పాయింట్స్ అంతే క‌నెక్టింగ్‌గా లేక‌పోయినా, ఫ‌స్టాఫ్ మీద కాస్త బెట‌ర్‌గానే అనిపిస్తుంది. ఇక అజ‌య్ ఘోష్ క్యారెక్ట‌ర్‌కు, క‌మెడియ‌న్ ప్ర‌వీణ్ లేడీ వాయిస్‌తో మాట్లాడే అప్ప‌డాల విజ‌య‌ల‌క్ష్మి అనే ఫిక్ష‌న‌ల్ పాత్ర‌కు మ‌ధ్య ఉండే కామెడీ ట్రాక్ మాత్రం ప్రేక్ష‌కుడిని బాగానే న‌వ్విస్తుంది. ఈ ట్రాక్ మిన‌హా సినిమాలో న‌వ్వించేంత ఏమీ క‌న‌ప‌డ‌దు. కొన్ని కామెడీ డైలాగ్స్‌లో ద్వంద్వార్థాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. ఇది మారుతి స్టైల్ అనుకోవాలంతే. ఇవి మాస్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతాయి.

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.