
పెద్దన్న… సినిమా రివ్యూ
నటులు:రజినీకాంత్,నయనతార,కీర్తీసురేశ్,ఖుష్బూ,మీనా,ప్రకాశ్ రాజ్,జగపతిబాబు,అభిమన్యు సింగ్దర్శకుడు: శివసినిమా శైలి:Action, Family
మెట్టినింటి బంధం దారంతో వేసిన ముడి.. అయితే పుట్టినింటి బంధం ప్రాణంతో సమానం. లాగే కొద్ది బలపడుతుంటుంది. ఈ పాయింట్ మీద అన్నా చెల్లెలు మధ్య అనురాగాన్ని తెలియజేసేలా సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం పెద్దన్న(అన్నాత్త). కీర్తిసురేశ్ ఇందులో రజినీకాంత్ చెల్లెలుగా నటించింది. నయనతార హీరోయిన్. ఇది వరకు రజినీకాంత్ సినిమాల్లో హీరోయిన్స్‌గా చేసిన ఖుష్బూ, మీనా కీలక పాత్రల్లో నటించారు. నలుగురు హీరోయిన్స్‌తో రజినీకాంత్.. అది కూడా సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సినిమా అనగానే సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ట్రైలర్ చూస్తే కోల్‌కత్తా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అని ప్రేక్షకాభిమానులకు అర్థమైంది. చాలా కాలంగా తలైవర్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమా చేయాలని, చేస్తాడని ఎదురుచూసిన సగలు రజినీకాంత్ అభిమానుల ఆశలు నేరవేరాయా? పెద్దన్న దీపావళి పండుగను అందించాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం.
తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రెసిడెంట్ వీరన్న(రజినీకాంత్). ఇతన్ని అందరూ పెద్దన్న అని పిలుస్తుంటారు. పెద్దగా చదువుకోడు. ఊర్లో ఎవరైనా అన్యాయం చేస్తే వారికి తగిన బుద్ధి చెబుతుంటాడు. ఊర్లో అతని చాలా మంచి పేరు, ప్రతిష్ట ఉంటుంది. అంతే మంది శత్రువులు కూడా ఉంటారు. వీరన్నకు ఏకైక బలం, బలహీనత అతని చెల్లెలు కనక మహాలక్ష్మి(కీర్తి సురేశ్). అప్పటికే తండ్రి లేని వీరన్నకు మహాలక్ష్మి పుట్టినప్పుడే తల్లి చనిపోతుంది. అయితే చెల్లెల్ని తానే తల్లి, తండ్రిగా మారి ఎంతో ప్రేమతో పెంచుకుంటాడు. ఆమె ఏ కష్టం రానీయడు. పెద్ద చదువులు చదివిస్తాడు. ఆమెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటాడు. అదే సమయంలో లాయర్ పార్వతితో వీరన్నకు పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది. మరో వైపు వీరన్నకు ఆ జిల్లాలో మరో పెద్ద దేవరాజ్(ప్రకాశ్‌రాజ్)తో అనుకోకుండా గొడవలు అవుతాయి. అయితే వీరన్న మంచి మనసు తెలుకున్న దేవరాజ్ మంచి మనిషిగా మారి తన తమ్ముడిని మహాలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయడానికి సంబంధం అడుగుతాడు. మంచి మనిషిగా మారిన దేవరాజ్ కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి వీరన్న కూడా సిద్ధపడతాడు.
అప్పటి వరకు అంతా నీ ఇష్టం అన్నయ్య అని చెప్పిన మహాలక్ష్మి పెళ్లి రోజు రాత్రితను ప్రేమించిన అరవింద్‌తో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. విషయం తెలిసిన వీరన్నకు మనసు విరిగిపోతుంది. కానీ అలా మహాలక్ష్మి తను చెప్పినవాడిని చేసుకోకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వెనుక బలమైన కారణముందని వీరన్నకు తెలుస్తుంది. చెల్లెల్ని కలుసుకోవడానికి పార్వతి సాయంతో కోల్‌కతా వెళతాడు. కానీ అక్కడ తన చెల్లెలు కష్టాలు పడుతుంటుంది. భర్త పక్కనుండడు. అసలేం జరిగింది? ప్రేమించి, పెళ్లి చేసుకున్న తన చెల్లెలి భర్త ఏమయ్యాడో వీర్నకు అర్థం కాదు. తన చెల్లెల కష్టానికి ఎవరు కారణం అనే విషయాన్ని తెలుసుకుని ఆమె కాపురాన్ని బాగు చేయాలని వీరన్న ముందడుగు వేస్తాడు.ఈ ప్రయాణంలో వీరన్నకు తెలిసే నిజాలు ఏంటి? చివరకు వీరన్న చెల్లెలు కష్టానికి కారణం ఎవరు? తన చెల్లెలు కాపురాన్ని వీరన్న నిలబెట్టుకుంటాడా? కోల్‌కత్తాలో వీరన్న ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అనే విషయాలు తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే..
సూపర్‌స్టార్ రజినీకాంత్‌కున్న ఇమేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. ఆయన ఇమేజ్‌కు, క్రేజ్‌కు తగ్గ హిట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ ప్రేక్షకులు అలాంటి ఓ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటు మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా సినిమాలు తీస్తూ వచ్చిన దర్శకుడు శివ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ పెద్దన్న(అన్నాత్త) సినిమాను అనౌన్స్ చేయగానే డైరెక్టర్ శివ, తమ అభిమాన కథానాయకుడిని మరో రేంజ్‌లో చూపిస్తాడని అభిమానులు భావించారు. సినిమా ఫస్టాఫ్‌లో స్టార్టింగ్ పాయింట్ మాస్‌గా కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రజినీకాంత్ మాస్ ఎంట్రీ ఉంటుంది. ఇది ఫ్యాన్స్‌కు కిక్ ఎక్కించే ఎలివేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడి నుంచి కథ రాజోలు గ్రామంలోకి వెళుతుంది. అక్కడ రజినీకాంత్, కీర్తిసురేశ్ మధ్య సిస్టర్ సెంటిమెంట్ ఓవర్ డోస్‌గా అనిపిస్తుంది. అలాగే ఇక ఖుష్బూ, మీనా పాత్రలు గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. వీరి పాత్రలు ఎంట్రీతో అప్పటి వరకు సాగిన బోరింగ్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోతుంది. సినిమా అంతా సాగదీతగా కనిపిస్తుంటుంది. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు తెర కంటే మొబైల్స్‌లో మెసేజ్‌లు చదువుకుంటూ కనపడ్డారంటే ఆ సీన్స్ ఎంతలా ఉన్నాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పెళ్లి నుంచి కీర్తిసురేశ్ వెళ్లిపోవడంతో అసలు కథ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత రజినీకాంత్ కోల్‌కత్తాలో ఎంట్రీ ఇవ్వడం.. అక్కడ చెల్లెలు కోసం చేసే బార్ ఫైట్ ఆకట్టుకుంటుంది. అక్కడ రజినీకాంత్ మాస్ ఇమేజ్‌ను ఫ్యాన్స్‌కు ఆడియెన్స్‌కు నచ్చేలా ఎలివేట్ చేసి దర్శకుడు ఆ సీన్‌లో సక్సెస్ అయ్యాడనిపించింది. అక్కడ నుంచి అసలు విలన్స్ అభిమన్యు సింగ్, జగపతిబాబు ఎంట్రీ ఉంటుంది. అసలు వారెలా కీర్తిసురేశ్‌ను ఇబ్బందులు పెడతారు. వారి నుంచి రజినీకాంత్ తన చెల్లెల్ని ఎలా కాపాడుకుంటాడనేది ఇక పక్కా కమర్షియల్ ఫార్మేట్‌లో సాగిపోతుంటుంది.