Cinetollywood

ఖైదీ నెంబర్ 150

khaidi

చిత్రం: ఖైదీ నెంబర్ 150

నటీనటులు: చిరంజీవి – కాజల్ అగర్వాల్ – తరుణ్ అరోరా – ఆలీ -బ్రహ్మానందం – రఘుబాబు – జయప్రకాష్ రెడ్డి -నాజర్ – పోసాని కృష్ణమురళి – రఘు కారుమంచి -పృథ్వీ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రత్నవేలు
రచన: పరుచూరి బ్రదర్స్ – సాయిమాధవ్ బుర్రా – వేమారెడ్డి
కథ: మురుగదాస్
నిర్మాత: రామ్ చరణ్
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: వి.వి.వినాయక్

దాదాపు దశాబ్దం విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. తన రీఎంట్రీ మూవీ కోసం పరిపరివిధాలుగా ఆలోచించి తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘కత్తి’ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు చిరు. ఒకప్పుడు మురుగదాస్ సినిమానే వినాయక్ దర్శకత్వంలో ‘ఠాగూర్’గా రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన చిరు.. ఈసారి కూడా మురుగదాస్ కథతోనే వినాయక్ దర్శకత్వంలో సినిమా చేశాడు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేసింది..? సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై చిరు ఎలా కనిపించాడు..? ఎలా పెర్ఫామ్ చేశాడు..? మొత్తంగా ‘ఖైదీ నెంబర్ 150’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చేలా ఉంది..? చూద్దాం పదండి.

కథ:

చిన్నప్పట్నుంచి దొంగతనాలు చేయడం అలవాటైన కత్తి శీను (చిరంజీవి) కోల్ కతా జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. ఆ జైలు నుంచి తప్పించుకున్న ఓ ఖైదీని పట్టించేందుకు పోలీసులకు సాయపడ్డట్లే పడి.. వాళ్లను బోల్తా కొట్టించి హైదరాబాద్ వచ్చేస్తాడు. ఇక్కడి నుంచి శీను బ్యాంకాక్ వెళ్లబోతూ ఎయిర్ పోర్టులో లక్ష్మి (కాజల్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయి ఆ ప్రయత్నం మానుకుంటాడు. ఇంతలో కొన్ని కారణాల వల్ల శీను తనలాగే ఉండే శంకర్ అనే ఉద్యమకారుడి స్థానంలోకి వెళ్లాల్సి వస్తుంది. ముందు తాను తప్పించుకోవడానికి శంకర్ ను వాడుకునే ప్రయత్నం చేసినా.. ఆ తర్వాత శంకర్ గొప్పదనమేంటో శీనుకు తెలిసి అతడి కోసం పోరాటానికి సిద్ధపడతాడు. ఇంతకీ శంకర్ ఎవరు.. అతడు ఎవరి కోసం ఉద్యమిస్తున్నాడు.. ఆ ఉద్యమానికి శీను ఏ విధంగా తోడ్పడ్డాడు.. అతడి సమస్యను ఎలా పరిష్కరించాడు.. అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

ముందుగా ‘ఖైదీ నెంబర్ 150’లో ఒక ముఖ్యమైన సన్నివేశం గురించి మాట్లాడుకుందాం. ప్రి క్లైమాక్సులో కథ చాలా సీరియస్ గా సాగుతుంటుంది. రైతుల సమస్య సిటీలో జనాలకూ తెలియాలనే ఉద్దశంతో హీరో తెలివైన ఎత్తుగడ వేస్తాడు. ఆ ఎత్తుగడ ఆసక్తి రేకెత్తిస్తుంది. కథ మలుపు తిరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. అప్పుడో కమర్షియల్ బ్రేక్ వస్తుంది.

హీరోయిన్ హీరోకు ఫోన్ చేసి అతణ్ని అభినందిస్తుంది. ఇప్పుడీ అభినందనలు ఎందుకయ్యా అంటే.. పాట కోసం అన్నమాట. అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు అంటూ చిరు చెలరేగిపోతాడు. ఆ పాటలో చిరు డ్యాన్సులు అదిరిపోయాయి. మధ్యలో చరణ్ కూడా వచ్చి రచ్చ చేస్తాడు. అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఐతే అంత సీరియస్ వ్యవహారం సాగుతున్నపుడు మధ్యలో ఈ పాట అవసరమా అంటే మాత్రం ఏం చెప్పాలో తెలియదు. అభిమానుల్ని ఆ పాట అలరించే మాట వాస్తవం. కానీ కథాగమనానికి మాత్రం ఆ పాట పెద్ద అడ్డంకే. ఇలాంటి అడ్డంకులు.. డీవియేషన్లు ‘ఖైదీ నెంబర్ 150’లో అక్కడక్కడా ఉన్నాయి.

ఎంతో ఇంటెన్సిటీ ఉన్న సిన్సియర్ కథ ఉంది ‘ఖైదీ నెంబర్ 150’లో. కానీ ఆ కథను అంత ఇంటెన్సిటీతో.. అంత సిన్సియర్ గా మాత్రం చెప్పలేదు. ఐటెం సాంగ్ అని.. డ్యాన్సులని.. కామెడీ అని.. తమిళ మాతృకకు అద్దిన కమర్షియల్ హంగులు చిరంజీవి అభిమానుల్ని బాగానే మెప్పిస్తాయి. మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఐతే ఈ హంగులు దీని మాతృక అయిన ‘కత్తి’లో ఉన్న ఇంటెన్సిటీని మాత్రం తగ్గించేశాయి. దశాబ్దం తర్వాత తెరపై పూర్తి స్థాయిలో కనిపించిన చిరు తనదైన శైలిలో అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తాడు ‘ఖైదీ నెంబర్ 150’లో. ఆయన నుంచి అభిమానులు ఆశించే ఆకర్షణలకు మాత్రం ‘150’లో లోటు లేదు.

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.